కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాస్ పోర్టుకు సంబంధించి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ ని ఢిల్లీ కోర్టు మూడేళ్ళ వరకే అనుమతించింది. తనకు పదేళ్ల వరకు చెల్లుబాటయ్యేలా సాధారణ పాస్ పోర్టు జారీకిగాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాహుల్ కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారని.. అందువల్ల ఈ దరఖాస్తును తిరస్కరించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మొదట కోర్టును కోరారు. అసలు ఈ దరఖాస్తులో మెరిట్ లేదన్న ఆయన… రాహుల్ గాంధీకి కేవలం ఒక్క సంవత్సరానికి మాత్రమే పాస్ పోర్టు మంజూరు చేసి ప్రతి ఏడాది రెన్యూ అయ్యేలా చూడాలన్నారు.
ఇది స్పెషల్ కేసు.. పదేళ్లకు దీన్ని జారీ చేయరాదు.. అన్ని సంవత్సరాలకు మంజూరు చేయడం సరికాదు అని స్వామి పేర్కొన్నారు. రాహుల్ కి బ్రిటిష్ పౌరసత్వం ఉందని, అందువల్ల ఆయన సిటిజెన్ షిప్ కూడా ప్రశ్నార్థకమేనని అన్నారు.
అయితే సిటిజెన్ షిప్ సమస్యలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరమని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయని రాహుల్ తరఫు లాయర్ తరన్నుమ్ ఛీమా .. కోర్టు దృష్టికి తెచ్చారు. తమ క్లయింటుకు పదేళ్ల కాలానికి పాస్ పోర్టు జారీ అయ్యేలా చూడాలని ఆమె అభ్యర్థించారు.
ఇంకా పెద్ద నేరాల్లో సంబంధితులకు పదేళ్ల వరకు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ..తన ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి జరిగిందని అంటూ సుబ్రహ్మణ్య స్వామి లోగడే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై కేసు పెట్టారు. ఛీటింగ్. కుట్ర, విశ్వాసోల్లంఘన జరిగాయని ఆరోపించారు.