-డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు
-8 గంటల పాటు విచారించిన సీబీఐ
-అరెస్టు చేస్తారని ముందే చెప్పిన సిసోడియా
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ రోజు ఉదయం నుంచి ఆయనపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఆయన ఏ1గా ఉన్నారు. ఈ కేసులో గతేడాది అక్టోబర్ లో ఆయన్ని సీబీఐ విచారించింది. ఆ తర్వాత నవంబర్ 25న ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయన విచారణ నిమిత్తం ఉదయం 11.12 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
విచారణకు హాజరయ్యే ముందే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఐ విచారణకు వెళుతున్నట్టు చెప్పారు. విచారణలో అధికారులకు సహకరిస్తానన్నారు. లక్షలాది మంది చిన్నారుల, కోట్లాది మంది డిల్లీ ప్రజల ఆశీర్వాదాలు తన వెంట ఉన్నాయన్నారు.
ఒక వేళ కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చినా తాను భయపడనన్నారు. దేశం కోసం ఉరికొయ్యలు ఎక్కిన భగత్ సింగ్ కు తాను అనుచరునన్నారు. అలాంటి అసత్య ఆరోపణలపై జైలుకు వెళ్లడం అనేది తనకు చాలా చిన్న విషయమని ఆయన పేర్కొన్నారు.
ఆప్ సర్కార్ తీసుకు వచ్చిన నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ మద్యం పాలసీని రూపొందించారంటూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు.
కొంత మందికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారంటూ నివేదికలో పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా పేరును నివేదికలో చేర్చారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు.