దేశ రాజధానిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. నార్త్, సౌత్ ఢిల్లిలో ఆక్రమణల నేపథ్యంలో మళ్లీ బుల్డోజర్లు వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. షాహీన్‌బాగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. మంగళవారం పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు.
ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపాల్టీ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో మంగళవారం ఉదయం భారీ భద్రత ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. దక్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేత డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ బుల్డోజర్లను అడ్డుకుని తిరిగి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు నార్త్ ఢిల్లీ మున్సిపాల్టీ పరిధిలోని మంగోల్‌పురిలో కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈనెల 13 వరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అయితే, కొన్ని రోజుల క్రితం జహంగిర్‌పురిలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్‌బాగ్‌లో నిర్మాణాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీ విజ్ఞప్తి మేరకు ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అందుకు సుప్రీంకోర్టు వేదిక కాదని, కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.