ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ని గురువారం దీన్ దయాళ్ ఆసుపత్రిలో చేర్పించారు. తీహార్ జైల్లోని వాష్ రూమ్ లో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య కారణాలపై ఆయనను వారం రోజుల్లో ఆసుపత్రికి తరలించడం ఇది రెండోసారి. ఈ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జైన్ వాష్ రూమ్ లో స్పృహ తప్పి పడిపోయారని వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించి పలు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని జైలు డీజీ చెప్పారు.
జైన్ వెన్నెముకకు సర్జరీ చేయవలసి రావచ్చునన్నారు. బలహీనంగా ఉన్నానని జైన్ తరచూ చెప్పడంతో ఆయనను ప్రత్యేకంగా అబ్జర్వేషన్ లో ఉంచినట్టు మరో అధికారి చెప్పారు. ఇటీవలి కాలంలో ఆయన సుమారు 35 కేజీల బరువు తగ్గిపోయి నీరసంగా కనిపిస్తున్నారని ఆప్ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆసుపత్రిలో జైన్ వీల్ చైర్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
బీజేపీ చేస్తున్న అరాచకాల వల్ల జైన్ వంటివారు ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. జైన్ కి , ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తీహార్ జైల్లో తనకు ఆహారం సరిపడక ఇంటినుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నానని ఇటీవల చెప్పిన సత్యేంద్ర జైన్.. ఆ ఫుడ్ కూడా సరిగా తినలేకపోతున్నారని జైలు వర్గాలు వెల్లడించాయి.