– లిస్టులో ఢిల్లీ సీఎం పేరు
– గోవా ఎన్నికలకు డబ్బులు చేరవేశారని అభియోగం
– విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు
– కేజ్రీవాల్, కవిత, మాగుంటతో పాటు 17 మంది పేర్లు
– 10 ఫోన్లు మార్చినట్లు ఆరోపణ
– లిక్కర్ స్కాంలో పెరగని నిందితుల లిస్ట్
క్రైంబ్యూరో, తొలివెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం నేతల కిక్కు దించేలా ఈడీ అదనపు ఛార్జ్ షీట్ ఉంది. మొత్తం 13,560 పేజీల ఛార్జ్ షీట్ లో నేతల డబ్బుల పంపకాల గురించి సవివరంగా పేర్కొంది. అందుకు 17 మంది పేర్లను ప్రస్తావించింది. వారు వాడిన సెల్ ఫోన్స్ డేటాను కలెక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ భారీ ఛార్జ్ షీట్ ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో నిందితులకు నేతలకు ఉన్న లింకులపై న్యాయస్థానం విచారణ జరపనుంది.
అవసరమైతే మరిన్ని అదనపు ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు ఈడీ రెడీగా ఉందని కోర్టుకు సమాచారం ఇచ్చారు న్యాయవాది. దీంతో లిక్కర్ స్కాం వ్యవహారం ఓ ఎపిసోడ్ లా రానుంది. ఛార్జ్ షీట్ సారాంశాన్ని 428 పేజీలతో న్యాయస్థానం ముందు ఉంచింది ఈడీ. ఈ బ్రీఫ్ నోట్ మీడియాకు లీకైంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పార్టీ ఆర్థిక లావాదేవీలను ఈడీ ప్రస్తావించింది. గోవా ఎన్నికలకు డబ్బులు ఎలా చేరవేశారో వివరించింది. ఈ ఛార్జ్ షీట్ లో 17 మంది పేర్లను కొత్తగా పేర్కొన్నారు. అయితే.. వీరెవరినీ కూడా నిందితులుగా చేర్చకుండానే ప్రస్తావించింది. దీంతో వారి పాత్రపై న్యాయస్థానం ఎలాంటి విచారణ చేపడుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఛార్జ్ షీట్ లో ఈడీ ఆరోపణలు
లిక్కర్ స్కాంపై సీబీఐ కేసు నమోదు చేయగానే ఇందులో పాలు పంచుకున్న వారంతా అలర్ట్ అయ్యారని ఈడీ పేర్కొంది. వెంటనే వారంతా సాక్ష్యాధారాలను నాశనం చేశారని తెలిపింది. ఆ జాబితాలో కేసీఆర్ కూతురు కవిత పేరుంది. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు గోవాకు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. సమీర్ మహేంద్ర నుంచి విజయ్ నాయర్ కు భారీగా ముడుపులు ముట్టినట్లు వివరించింది. కవితకు అరుణ్ పిళ్లై సన్నిహితుడని.. అతను భారీగా డబ్బులు పొగుచేసుకున్నట్లు తేల్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫేస్ టైంలో నిందితుడు విజయ్ నాయర్ తో మాట్లాడినట్లు ఆధారాలు సేకరించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇలా 12 మందిపైన అభియోగాలు మోపుతూ 7 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.