ఢిల్లీ రోడ్లపై బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని అక్కడి రవాణా శాఖ హెచ్చరించింది. ఇది 1988 నాటి మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమించినట్టవుతుందని, దీన్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. వ్యాపార ప్రయోజనాలకు ఇలాంటి బైక్ ట్యాక్సీలను వినియోగిస్తే మొదటి నేరానికి 5 వేలరూపాయలు, రెండో నేరానికి 10 వేలు, ఏడాదిపాటు జైలుశిక్ష, పడుతుందని ఈ శాఖ తెలిపింది.
డ్రైవర్ లైసెన్స్ ని కూడా మూడు నెలల పాటు రద్దు చేస్తారట. ఈ చట్టాన్ని తాము పట్టించుకోబోమని యాప్ ఆధారిత కొన్ని సంస్థలు చెప్పుకుంటున్నాయని, కానీ దీన్ని అతిక్రమిస్తే లక్ష రూపాయల ఫైన్ విధిస్తామని తన నోటీసులో పేర్కొంది.
తమకు లైసెన్స్ ఇవ్వాలని చేసిన అభ్యర్థనను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ర్యాపిడో సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.
2019 నాటి మోటారు వాహనాల చట్టానికి చేసిన సవరణల మేరకు వ్యాలిడ్ లైసెన్స్ లేనిదే ఇలాంటి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించజాలవని కోర్టు స్పష్టం చేసింది. లైసెన్స్ విషయంలో తమ విజ్ఞప్తిని పూణే లోని ప్రాంతీయ రవాణా కార్యాలయం తోసిపుచ్చిందని, ఇది సముచితం కాదని ర్యాపిడో లోగడ సుప్రీంకోర్టుకెక్కింది.