‘అగ్నిపథ్’ పథకం సరైనదేనని ఢిల్లీ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. సాయుధ దళాల్లో యువకుల రిక్రూట్మెంట్ కి సంబంధించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని.. కానీ ఈ చర్య సరైనది కాదని సవాలు చేస్తూ కనీసం 23 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటినన్నింటినీ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
ఈ పథకం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటవుతుందని, ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణమేదీ తమకు కనబడలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం అగ్నిపథ్ పథకాన్నిప్రవేశపెట్టిందని, సాయుధ దళాలను బలోపేతం చేసేందుకే ఇది ఉద్దేశించినదని వారు స్పష్టం చేశారు.
ఈ స్కీం ని ప్రవేశపెట్టిన తరువాత దీనికి నిరసనగా దేశంలో పలుచోట్ల జరిగిన ఘటనలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఓ అడ్వొకేట్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు గత ఏడాది నిరాకరించింది.
ఇక ఈ పథకాన్ని సవాలు చేస్తూ దేశ వ్యాప్తంగా హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్కీం కింద సైన్యంలో నియామకాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అయితే ఇందుకు సంబంధించిన పిటిషన్లనన్నింటినీ ఆ తరువాత సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.