పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను ఆది పురుష్ మూవీ టీమ్ దెబ్బ తీసిందంటూ ఓ సంస్ధ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ కోర్టును ఆ సంస్థ కోరింది.
ఈ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ మూవీ టీమ్ కు సైతం నోటీసులు జారీ చేసింది. ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. దీనిపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా టీజర్ పై గత కొద్ది రోజులుగా తెగ ట్రోల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది.
ఈ సినిమాలో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని పలు హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. రామాయణంపై ఏ మాత్రం అధ్యయనం చేయకుండానే దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ను తెరకెక్కించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాతో హిందువుల మత విశ్వాసాలు దెబ్బతిన్నాయని అందుకే ఈ సినిమాను నిషేధించాలని కోరుతున్నాయి.