ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్‌తో 24,718 కోట్ల ఒప్పందంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ను యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ సంస్థకు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేకులు వేసింది. అమెజాన్ హక్కుల పరిరక్షణకు తక్షణ మధ్యతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ సంస్థ వాదనలతో కోర్టు సంతృప్తి చెందుతున్నట్లు జస్టిస్ జేఆర్ మిద్రా పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
ప్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదంటున్న అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ తమతో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెజాన్ వాదిస్తుంది. రిలయన్స్ కు ఫ్యూచర్ గ్రూప్ ను అమ్మే సమయంలో తమ అంగీకారం తీసుకోకపోవటంపై సింగపూర్ లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అమెజాన్ ఆశ్రయించింది. అక్కడ కేసు పెండింగ్ లో ఉండగానే… ఈ విక్రయాన్ని ఆమోదించవద్దని సెబీలో అప్పీల్ చేసింది. అయితే, సెబీ మాత్రం అమెజాన్ వాదనను తోసిపుచ్చింది.
ఫ్యూచర్ గ్రూప్ కలయికతో రిటైల్ మార్కెట్లో రిలయన్స్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేందుకు తహతహాలాడుతున్న సమయంలో ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది.