ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో అంజలి మృతికి కారణమని భావిస్తున్న అయిదుగురు నిందితులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖాకీల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. యాక్సిడెంట్ జరిగిన రోజున కారు నడిపినట్టు భావించిన వ్యక్తి అసలు ఆ కారులోనే లేడని. ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాడని ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయింది. ఆ సమయంలో నువ్వు మాతోనే ఉన్నావని పోలీసులకు చెప్పాలని దీపక్ ఖన్నా అనే నిందితుడ్ని అతడి కజిన్ తో బాటు ఇతర స్నేహితులు కోరారని తెలిసింది.
ఇతనికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని పోలీసులు చెప్పారు. దీపక్ ఫోన్ లొకేషన్ ని బట్టి చూస్తే.. అతడు చెబుతున్న సమయానికి, ఇతర నలుగురు నిందితులు చెబుతున్న సమయానికి మధ్య చాలా తేడా ఉందని వెల్లడైందన్నారు.దీపక్ ఫోన్ లొకేషన్, కాల్ రికార్డులను బట్టి చూస్తే ఇతగాడు ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాడని రూఢి అయిందని పోలీసులు చెప్పారు. 26 ఏళ్ళ దీపక్ గ్రామీణ్ సేవా సంస్థలో పని చేసే డ్రైవర్.. ఇతని బదులు డ్రైవింగ్ లైసెన్స్ లేని అమిత్ ఖన్నా ఆ రోజున కారు నడిపాడు.. ఇందుకు శాస్త్రీయ ఆధారాలు మావద్ద ఉన్నాయి అని స్పెషల్ పోలీసు కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.
ప్రమాదం జరిగిన అనంతరం అమిత్.. దీని గురించి తన సోదరుడు అంకుష్ ఖన్నాకు చెప్పాడని, డ్రైవింగ్ లైసెన్స్ దీపక్ వద్దే ఉంది గనుక అతనిపై నేరం తోసివేయాలని అంకుష్ సలహా ఇచ్చాడని ఆయన వివరించారు. అందువల్లే అంకుష్ తో బాటు అశుతోష్ అనే మరో వ్యక్తి కోసం కూడా తాము గాలిస్తున్నామని అన్నారు.
ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉందన్నారు. ఇంటరాగేషన్ లో నిందితులు పరస్పర విరుద్ధమైన విషయాలు చెబుతున్నారని పోలీసులు ఆరోపించారు. విచారణ సమయంలో దీపక్ కంట తడిపెట్టాడని, తన జోక్యం ఉన్నట్టు ఒప్పుకున్నాడని వారు తెలిపారు. అసలు గత ఆదివారం నాడు జరిగిన యాక్సిడెంట్ గురించి తమకేమీ తెలియదని ఈ 5 గురు నిందితులూ పోలీసులకు అబధ్ధం చెప్పినట్టు నిర్ధారణ అవుతోంది.