భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం ఢిల్లీ కోర్ట్ లో విచారణ జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై గత నెల ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించిన ఆజాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా జడ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న జడ్జీ…నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు అని అన్నారు. ఆజాద్ పై ఢిల్లీ పోలీసులు మోపిన కేసుల జాబితాను చూసిన జడ్జీ…”మీరు జమా మసీదు పాకిస్థాన్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు..పాకిస్థాన్ లో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లి నిరసన వ్యక్తం చేయొచ్చు” నన్నారు. పాకిస్థాన్ అవిభజిత భారతదేశంలో భాగమేనని గుర్తు చేశారు.
డిసెంబర్ 21న జమా మసీదు దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న ఆజాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పోయారు. ఆ తర్వాత రెండు రోజులకు అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై అల్లర్లు, హింసకు పాల్పడినట్టుగా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు ప్రారంభించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎఫ్.ఐ.ఆర్ లోని అంశాలు తెలియకుండానే భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పై ఉత్తరప్రదేశ్ లో ఉన్న కేసుల గురించి ప్రస్తావించడం మొదలు పెట్టాడు. ఆ కేసుల గురించి వివరాలు తెలియజేయమని అడిషనల్ సెషన్స్ జడ్జీ కామిని లాహు అడగ్గానే ఆశ్యర్యానికి గురై కనుక్కుంటానని సమాధానమిచ్చారు. తాను వాదించే కేసు ఎఫ్.ఐ.ఆర్ లో ఏముందో కూడా తెలియకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు మొదలుపెట్టారు.
ఆజాద్ సోషల్ మీడియా పోస్టులు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని ప్రాసిక్యూటర్ తెలిపారు. జమా మసీద్ దగ్గర ధర్నా ఉందని భీమ్ ఆర్మీ చీఫ్ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టినట్టు కోర్టు దృష్టికి తీసుకురాగా దానిలో తప్పేముందని ప్రశ్నించారు. ధర్నా చేయడం రాజ్యాంగ హక్కు అని చెప్పారు. అంతే కాదు..హింస ఎక్కడ జరిగింది? ఈ పోస్టుల్లో తప్పేముంది? నిరసన వ్యక్తం చేయవద్దని ఎవరు చెప్పారు? నీవు రాజ్యాంగం చదివావా..? అని జడ్జీ ప్రశ్నించారు. ఈ పోస్టులేవి రాజ్యాంగ విరుద్ధం కావని స్పష్టం చేశారు. నిరసనలకు పోలీసు అనుమతి తీసుకోవాలని..సెక్షన్ 144 అమల్లో ఉందని ప్రాసిక్యూటర్ చెప్పగా…గత వారమే సుప్రీంకోర్టు జమ్ము కశ్మీర్ లోని 144 సెక్షన్ పై ఆంక్షలు విధించిందని…ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిని సెక్షన్ 144 తో అణిచివేయడం కాదా అని జడ్జీ ప్రశ్నించారు. మసీదు బయట నిరసన వ్యక్తం చేయడం తప్పా? నేను పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేసిన సంఘటనలు కూడా చూశానని అన్నారు. ఆజాద్ ను ఏ చట్టం ప్రకారం నిరసన వ్యక్తం చేయనీయలేదో… ఆయన హింసకు పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. ఆజాద్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని..హింసకు పాల్పడినట్టుగా తమ దగ్గర డ్రోన్ పుటేజ్ ఉందని…తనకు కొంత సమయం ఇస్తే చూపిస్తానని కోరాగా విచారణ రేపటికి వాయిదా వేశారు.
తనపై ఎలాంటి అభియోగాలు లేకుండా పోలీసులు యాంత్రికంగా అరెస్ట్ చేశారని ఆజాద్ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నాడు.తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించాడు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్దులు, ప్రతిపక్షాలు, యువత నిరసనలు తెలుపుతున్న నేపధ్యంలో జడ్జీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.