ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు కు మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రైవేట్ డిస్కం బోర్డుల్లో ప్రభుత్వం నామినీలుగా నియమించిన వారిని తక్షణమే తొలగించాలని సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వీరిని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఈ పోస్టుల్లో నియమించారని, వీరి స్థానంలో సీనియర్ ప్రభుత్వ అధికారులను నియమిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
బీవై పీ ఎల్, బీఆర్పీ ఎల్, (అనిల్ అంబానీ), టాటా నేతృత్వం లోని ఎన్ డీ పీ డీ సీ ఎల్ డిస్కంలలో భారీ అవినీతి జరిగిందని సక్సేనా అనుమానిస్తున్నారు. ఈ డిస్కంలలో ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా, ఆప్ ఎంపీ ఎన్ డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తా, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ నామినీలుగా ఉన్నారు.
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని డిస్కం బోర్డుల్లో గల ప్రైవేటు ప్రతినిధులతో జాస్మిన్ షా, నవీన్ గుప్తా కుమ్మక్కయ్యారని, ప్రభుత్వ ఖజానాకు దాదాపు 8 వేల కోట్ల నష్టం కలిగించారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. రాజ్యాంగంలోని 239 ఏఏ లోని కొన్ని పరస్పర విరుద్ధ అంశాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తనకు అనువుగా వినియోగించుకుని ఈ బోర్డుల్లో తనవారిని కొనసాగేలా చేసిందని ఈ ప్రకటనలో ఆరోపించారు.
వీరి అక్రమ ప్రవర్తన తెలిసినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా చూసీచూడనట్టు ఉందని, … అంబానీ నేతృత్వం లోని డిస్కంలకు ప్రయోజనం కలిగేలా వీరు వ్యవహరించారని సక్సేనా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన దీన్ని రాష్ట్రపతి కార్యాలయానికి నివేదించారు. అయితే సక్సేనా ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, విద్యుత్తుపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని ఆప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ అన్నింటినీ సక్సేనా అపహాస్యం చేసినట్టవుతోందని కేజ్రీవాల్ సర్కార్ దుయ్యబట్టింది.