ఢిల్లీ నగరంలో ఓ యువతిని కారు 12 కి.మీ. దూరం ఈడ్చుకువెళ్లిన ఘోర ఘటనవంటిదే గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ఈ అమానుష సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బైకుపై వస్తున్న ఈ యువకుడి వాహనంవేగంగా వెళ్తున్న కియా కారును ఢీ కొనడంతో అతడు కింద పడిపోయాడు. కారుచక్రంలో ఇతని తల చిక్కుకుపోగా ఆ వాహనం అలాగే 12 కి.మీ. దూరం ఈడ్చుకువెళ్లింది.
కారు వెనుకే వస్తున్న ఓ వ్యక్తి తన మొబైల్ లో ఇదంతా చిత్రీకరించాడు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ నెంబరుతో సహా పోలీసులకు సమాచారం తెలియజేశాడు. ఈ యాక్సిడెంట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
కారు ఈడ్చుకుపోయిన ఘటనలో మృతి చెందిన వ్యక్తిని సాగర్ పాటిల్ గా గుర్తించారు. అతని భార్య అశ్విని కూడా ఈ ఘటనలో కిందపడిపోయి గాయపడింది. 12 కి.మీ. దూరం ప్రయాణించాక కారు ఆగిపోయిందని, అప్పటికే సాగర్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఇతని బైక్ పూర్తిగా నాశనం కాగా.. కియా కారు కూడా దెబ్బ తిన్నదని వారు చెప్పారు. సాగర్ మృతదేహాన్ని ఘటన జరిగిన కొన్ని కిలోమీటర్ల దూరంలో కనుగొన్నామని పోలీసులు పేర్కొన్నారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడా అన్న విషయం తెలియలేదు. అతడు పరారీలో ఉన్నట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.