ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. ఈ కేసులో మరో నిందితుడైన ఇండోస్పిరిట్ ఎండీ అయిన సమీర్ మహేంద్రు నుంచి పిళ్ళై ముడుపులు స్వీకరించి ఇతర నిందితులకు ఇచ్చాడని ఈడీ పేర్కొంది. వట్టినాగులపల్లి లో పిళ్ళై కి చెందిన రూ. 2.2 కోట్ల విలువైన భూమిని ఈడీ ఇదివరకే ఎటాచ్ చేసింది. ఆయనను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారని, తాను కవిత ప్రతినిధినని ఆయన అంగీకరించాడని తెలిసింది.
ఆయనను 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా కోర్టు ఇందుకు సమ్మతించింది. ఈ నెల 13 వరకు పిళ్ళై ఈడీ కస్టడీలో ఉంటారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తునకు పిళ్ళై సహకరించడం లేదని మనీ లావాదేవీల వివరాలను తేల్చడానికి కస్టడీ అవసరమని, 25 కోట్లను ఆయన నేరుగా బదిలీ చేశారని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా ఉన్న ఆయన లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారని, సమీర్ మహీంద్రుతో కలిసి ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించారని వారు వివరించారు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయని వెల్లడించిన ఈడీ.. సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ మొత్తాల పంపిణీలో కూడా పిళ్ళై ప్రధాన పాత్ర వహించినందున ఇద్దరినీ కలిపి విచారించాలని అభ్యర్థించింది.
అయితే తన క్లయింటును 29 రోజులపాటు విచారించారని, కానీ దర్యాప్తునకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోందని పిళ్ళై తరఫు న్యాయవాది వాదించారు. ఇన్ని సార్లూ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారన్నారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ పిళ్ళై సమాధానాలు ఇచ్చారని తెలిపారు. తన క్లయింటు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు అవసరమైన మందులు ఇవ్వాలని కోరుతున్నానని చెప్పిన ఆయన. .పిళ్ళై తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా బాగులేదని,కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అయితే పిళ్ళైని అరెస్టు చేసేందుకు ఇంత జాప్యం ఎందుకు జరిగిందని ఈడీ అధికారులను కోర్టు ప్రశ్నించింది.
లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు,ఇతర ఆధారాలు ఉన్న తరువాత పదేపదే పిలిచి ఎందుకు ఇంటరాగేట్ చేస్తున్నారని, నేరుగా అరెస్టు చేయవచ్చుకదా అని జడ్జి అన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు పిళ్ళైకి కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టయిన వారిలోహైదరాబాద్ కు చెందినవారే ఎక్కువ మంది ఉండడం విశేషం. పిళ్ళై తో బాటు అభిషేక్ బోయిన్ పల్లి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ తదితరులంతా ఈ నగరానికి చెందినవారే. ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది.