ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవ రెడ్డి జుడిషియల్ కస్టడీని రౌజ్ ఎవెన్యూ సీబీఐ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఆయనను ఇంకా విచారించవలసి ఉందని, అందువల్ల కస్టడీ పొడిగించాలని ఈడీ-కోర్టును కోరింది. శనివారం రాఘవరెడ్డి ని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు.
ఈ నెల 13 న కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది. రాఘవరెడ్డి తండ్రి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.
ఈ కేసులో రాఘవ రెడ్డిని గత ఫిబ్రవరి 10 న అరెస్టు చేశారు. ఆయన భారీ మొత్తాల్లో నగదు బదిలీ, ఇతర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
అయితే ఈ కేసుతో తమకెలాంటి సంబంధం లేదని, కుట్ర వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో చాలాసార్లు పేర్కొన్నారు. లిక్కర్ వ్యాపారాలన్నీ తమ బంధువులే చూసుకుంటున్నారని కూడా ఆయన తెలిపారు.