ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణలోకి తీసుకోవడం పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. జనవరి 6న 13,657 వేల పేజీల అనుబంధ చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది.
అయితే 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదిక అందింది. సప్లిమెంటరీ చార్జిషీట్ లో ఐదుగురు పేర్లను, ఏడు కంపెనీలను ఈడీ చేర్చింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి, బెనోయ్ బాబు, అమిత్ అరోరాలను ఈడీ నిందితులుగా చేర్చింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లమెంటరీ చార్జిషీట్ లో ఈడీ పేర్కొన్నట్లు సమాచారం. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, విజయ్ నాయర్, బినోయ్ బాబు ఉన్నారు. ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో కంపెనీ ఒప్పందాలను బయటకు వెల్లడించవద్దని సమీర్ మహీంద్ర పిటిషన్ దాఖలు చేశారు.
సమీర్ మహీంద్ర రిక్వెస్ట్ ని స్పెషల్ కోర్టు అనుమతించింది. సమీర్ మహీంద్రు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అభియోగాల పత్రంలో సమాచారం బయటకు వెళితే తమ వ్యాపారాలకు ప్రమాదం ఉందన్నారు. తమ కంపెనీ వ్యక్తిగత సమాచారం బయటపెట్టడానికి వీలు లేదన్నారు. రహస్య ఒప్పందాలు లీక్ అయితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. అయితే ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది.
వ్యాపార వేత్త సమీర్ మహీంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్ ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. సమీర్ మహీంద్రుకు చెందిన 35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అలాగే అమిత్ అరోరాకు చెందిన 7.68 కోట్లు, విజయ్ నాయర్ కు చెందిన 1.77 కోట్ల ఆస్తిని అటాచ్ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ వ్యవహారంలో 2,873 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పటి వరకు 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు.