ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఆయనపై ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.
ఈ కేసులో సిసోడియాతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ కేసులు పెట్టింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటీవల సీబీఐకి కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా దర్యాప్తు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్‌లో ఆయనపై నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారని పలు అభియోగాలు మోపింది.
ఈ కేసులో సిసోడియాతో పాటు పలువురు ప్రముఖుల పేర్లను సీబీఐ చేర్చింది. ఇందులో ఢిల్లీ ప్రభుత్వ మాజీ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా, అప్పటి సీఎం ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ పేర్లు వున్నాయి.
మరోవైపు ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంది. కానీ అనారోగ్య కారణాలు, మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచే విషయానికి సంబంధించి తన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో వున్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత తెలిపారు.