ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.
సిసోడియా అభ్యర్థనను సుప్రీం కోర్టు మన్నించింది. ఈ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు విచారణ జరపనున్నట్టు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సిసోడియాను లిక్కర్ స్కాంలో సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు కోసం సిసోడియాను కస్టడీలో విచారించడం అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిసోడియాకు ఐదు రోజుల పాటు సీబీఐ రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో నిందితులు చాలా ప్రణాళికబద్దంగా, రహస్యంగా కుట్ర పన్నారని సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ కేసులో వాదనలు విన్న రోస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. రిమాండ్ సమయంలో సిసోడియాను సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాలని సూచించింది. విచారణను వీడియోలో చిత్రీకరించాలని సూచించింది. విచారణ తర్వాత వీడియోను భద్రపరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.