ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ బుచ్చిబాబుకు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈనెల 8న ఈయన్ను అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే మూడు రోజుల సీబీఐ కస్టడీ విధించగా అది ముగిసింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
బుచ్చిబాబు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని కోర్టుకు వివరించారు అధికారులు. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరారు. దీంతో సీబీఐ అధికారులతో ఏకీభవించిన స్పెషల్ కోర్టు.. బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని విధించింది. ఈనెల 25వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగనుంది.
లిక్కర్ పాలసీ కుట్రలో బుచ్చిబాబు భాగస్వామిగా ఉన్నారని.. నిందితులతో కలిసి అనేక మీటింగ్ లలో ఆయన పాల్గొన్నారని సీబీఐ అధికారులు ఆరోపించారు. మరోవైపు బుచ్చిబాబుతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని కూడా ఈడీ అధికారులు సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు.