దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువతిని ఓ వ్యక్తి జ్టుటపడ్టి కారులోకి లాక్కెళ్లాడు. బలవంతంగా ఆమెను కారులోకి తోసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారంతా చోద్యం చూశారే తప్పా ఎవరూ ఆ యువతికి సహాయం చేయలేదు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వాయవ్య ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఫ్లై ఓవర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. తొలుత బాధిత యువతిని ఓ యువకుడు ఆమె షర్ట్ పట్టి మళ్లీ బలవంతంగా క్యాబ్ లోకి నెట్టాడు.
క్యాబ్‌లోకి ఆమెను బలవంతంగా నెట్టాడు. ఇది జరుగుతున్న సమయంలో క్యాబ్ లోని మరో వ్యక్తి అలాగే చూస్తూ వుండిపోయాడు. అనంతరం ఇద్దరు క్యాబ్ లోకి ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినట్టు ఔటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ డీసీపీ తెలిపారు. క్యాబ్ డ్రైవర్ అడ్రస్ గుర్తించామన్నారు. అతన్ని పోలీసులు విచారించేందుకు వెళుతున్నారని చెప్పారు. ఓ యువతి, ఇద్దరు యువకులు ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నారని తెలిపారు.
వారు రోహిణి నుంచి వికాస్‌పురికి క్యాబ్ లో వెళుతున్నారని చెప్పారు. కానీ మార్గమధ్యంలో వారి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఈ క్రమంలో యువతి కారు దిగి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిందన్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు ఆమెను మెడపట్టి బలవంతంగా కారులోకి తోశాడని వివరించారు. క్యాబ్ ఓనర్ చిరునామాను గుర్తించామని అక్కడికి పోలీసు బృందాలను పంపామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.