ప్రస్తుతం వైద్యం అత్యంత ఖరీదైన మార్కెట్ వస్తువుగా మారింది. వైద్యం ఖర్చులు పేదలకు భారంగా మారాయి. ఏండ్ల తరబడి కష్టపడి కూడబెట్టినదంతా ఒక్క రోగంతో తుడిచి పెట్టుకుపోతోంది. ఇంకొన్ని సార్లైతే తలకు మించిని అప్పులు చేసి కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చిన సందర్బాలు లేకపోలేదు.
తాజాగా వైద్యం ఖర్చులు భారం కావడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన నితీష్(24) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
వైద్య ఖర్చులు భారంగా మారడంతో అతను తీవ్ర కుంగిపోయాడు. ఈ క్రమంలో నార్త్ ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఓ హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్ లోని ఆక్సిజన్ ను పైపు ద్వారా భారీ స్థాయిలో పీల్చి ప్రాణాలు తీసుకున్నట్టు వెల్లడించారు.
మోతాదుకు మించి ఆక్సిజన్‌ను పీల్చుకుంటే గుండె కొట్టుకునే వేగం పడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చివరకు మరణం కూడా సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. దీన్ని ఆక్సిజన్ పాయిజనింగ్ అంటారని వివరిస్తున్నారు.
హోటల్ గదిలో నితీష్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలికంగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, తడిసి మోపెడవుతున్న వైద్య ఖర్చులతో తాను తనను మానసింగా కుంగిపోయినట్టు లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు.