శ్రధ్ధా వాకర్ తరహాలోనే ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ గెహ్లాట్ అనే యువకుడు ఈ నెల 9 న దారుణంగా హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. పైగా ఈ ఘోరానికి పాల్పడిన రోజే మరో యువతిని పెళ్లాడాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ ఈ నెల 10 న గోవా వెళదామనుకున్నారట. అయితే 9 న నిక్కీ తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగానే సాహిల్ ఇందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో గోవా ట్రిప్ ని రద్దు చేసుకున్నారు.
తనపై నిక్కీ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన సాహిల్..ఆమెను చంపి డెడ్ బాడీని నగర శివార్లలోని మిత్రాన్ గ్రామంలో గల ఓ ధాబాలో ఉన్న ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. ఫిబ్రవరి 9-10 తేదీల్లో రాత్రి ఇతడు తన కారులో తన మొబైల్ కి చెందిన డేటా కేబుల్ ని ఆమె మెడకు బిగించి హత్య చేశాడని తెలుస్తోంది. తన కుమార్తె గురించి ఈ నెల 11 న సాహిల్ కి ఫోన్ చేయగా ఆమె తన స్నేహితురాళ్ళతో ముస్సోరి, డెహ్రాడూన్ కి వెళ్లిందని, తన ఫోన్ ని నా దగ్గరే వదిలేసిందని సాహిల్ చెప్పాడని నిక్కీ తండ్రి తెలిపారు.
అయితే సాహిల్ అబధ్ధాలు చెబుతున్నాడని తనకు అర్థమైందని ఆయన అన్నారు. నా కూతురి హత్య గురించి పోలీసుల ద్వారా తనకు మంగళవారం నాడే తెలిసిందని ఆయన వాపోయారు. సాహిల్ ని ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. నిక్కీ తండ్రితో బాటు ఆమె బంధువులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు సాహిల్ ని అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.
కోర్టు ఇతడికి 5 రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది. 2018 నుంచి తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిక్కీ తో కాకుండా తాము నిశ్చయించిన మరో యువతిని పెళ్లి చేసుకోవాలని తన కుటుంబం తనను ఒత్తిడి చేస్తూ వచ్చిందని..ఫిబ్రవరి 9 న ఈ పెళ్లి జరగాలని కోరారని.. దాంతో గత డిసెంబరులో తన నిశితార్థం జరిగిందని చెప్పాడు. కానీ నిక్కీకి ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాడట. ఆమెను హతమార్చిన తరువాత కామ్ గా తన సొంత ఊరికి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని సాహిల్ .. పోలీసులకు తెలిపాడు.