ఢిల్లీలోని సుల్తాన్ పురికి చెందిన యువతిని కారు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటనపై పాలక ఆప్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ళ యువతిని కారులో వెళ్తున్న తాగుబోతులు తమ వాహనంతో ఢీ కొట్టి అలాగే ఆమెను ఈడ్చుకువెళ్లిన అమానుషం దేశవ్యాప్త సంచలనమైంది. కొత్త సంవత్సరం నాడు ఆమె నగ్న మృతదేహాన్ని నగర శివార్లలో కనుగొన్నారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వీడియో ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణంపై సోమవారం ఆప్ కి చెందిన వందలాది కార్యకర్తలు, సుల్తాన్ పురి స్థానికులు సైతం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. బాధిత యువతికి న్యాయం జరగాలని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. వారు ఆయన నివాసం వద్ద ధర్నాకు కూచున్నారు.
‘ఢిల్లీని లెఫ్టినెంట్ గవర్నర్ జంగిల్ రాజ్’ గా మార్చారని, ఆయన రాజీనామా చేయాలని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహిళల్లో పలువురు సుల్తాన్ పురి పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇది అత్యంత దురదృష్టకర ఉదంతమని, ఈ కిరాతకానికి పాల్పడిన నిందితులందరినీ ఉరి తీయాలని అన్నారు. అది అరుదైన నేరమన్నారు.
సుల్తాన్ పురి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ పై ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. వారి కారుపై రాళ్లు విసిరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్.. స్వాతి మలివాల్.. నగర పోలీసులకు నోటీసు జారీ చేస్తూ .. ఈకేసులో దోషులనెవరినీ వదలరాదన్నారు. దాదాపు గంటన్నర సేపు నిందితుల కారు బాధిత యువతిని లాక్కుపోయినట్టు తెలుస్తోంది.
అత్యంత సంచలనం రేపిన ఈ కేసులో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ అనే వీరిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. వీరిలో బీజేపీకి చెందిన నేత ఒకడున్నాడని, అతడిని రక్షించేందుకు, కేసును ఆషామాషీగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. బాధిత యువతిపై ఈ నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కూడా ఆయన దుయ్యబట్టారు. ఈ కేసు విషయమై పోలీసు అధికారులతో అత్యవసరంగా సమావేశం కావలసిన ఆయన .. బోటు రైడింగ్ తో ఎంజాయ్ చేశారని సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.