ఆప్, బీజేపీ సభ్యుల గలభాతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మున్సిపల్ హౌస్ లో ఉభయ పార్టీలకు చెందిన కౌన్సిలర్లంతా చేరగానే.. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నామినేట్ చేసిన సభ్యులకు కూడా ఓటింగ్ హక్కులు ఉన్నాయని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలో వీరు కూడా ఓటు వేయవచ్చునన్నారు. ఏకకాలంలో ఈ ఎన్నికలు జరుగుతాయని సత్యశర్మ స్పష్టం చేయగానే ఆప్ కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇలా ఆల్దర్ సభ్యులను ఓటింగ్ లో అనుమతించరాదని వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ ని మొదట పది నిముషాలు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా హౌస్ లో ఇదే పరిస్థితి కనిపించింది. ఆప్ కౌన్సిలర్లకు, బీజేపీ సభ్యులకు మధ్య తీవ్ర స్థాయిన వాదోపవాదాలు జరిగాయి. ఆప్ నేత ముకేశ్ గోయెల్ ఈ రభసకు కారణమని బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా ఆరోపించగా.. గోయెల్ కూడా ఆయనపై విరుచుకుపడ్డారు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచనలను మీరు పాటించడం లేదని బీజేపీ కౌన్సిలర్లు కేకలు పెట్టడంతో ఆప్ సభ్యులు వారితో వాదులాటకు దిగడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేయర్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు సత్యశర్మ ప్రకటించారు.
ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్.. ఈ వ్యవహారంపై తాము సుప్రీంకోర్టుకెక్కుతామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలో నామినేటెడ్ కౌన్సిలర్లకు ఓటింగ్ హక్కు కల్పించడం ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పును అవమానపరచడమేనన్నారు. లోగడ జనవరి 6 న, ఆ తరువాత జనవరి 24 న కూడా ఆప్, బీజేపీ కౌన్సిలర్ల రభస కారణంగా మేయర్ ఎన్నిక లేకుండా వాయిదా పడింది. ఆప్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మందిని నామినేటెడ్ సభ్యులుగా ఎలా నియమిస్తారని ఆప్ గతంలో కూడా ప్రశ్నించింది.