ఈ నెల 16 న ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆమోదించారు. ఇప్పటికే నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల రభస కారణంగా ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది.
ఈనెల 16 న డా. ఎస్.పి. సివిక్ సెంటర్ హాలులో మేయర్, డిప్యూటీ మేయర్, మరో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని సక్సేనా కార్యాలయం తెలిపింది. అయితే ఈ సారైనా ఈ ఎలెక్షన్ సవ్యంగా జరుగుతుందా అని విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బోర్డు డిస్కంలలో ప్రభుత్వం నియమించిన నామినీలను తొలగిస్తూ నిన్న సక్సేనా జారీ చేసిన ఉత్తర్వులపై ఆప్ సర్కార్ మండిపడుతున్న నేపథ్యంలో దీని ప్రభావం 16 న జరిగే ఈ ఎన్నికపై ఉండవచ్చునని వారు భావిస్తున్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులు లేవని ఆప్ సభ్యులు మొదటినుంచి వాదిస్తున్నారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లు విభేదించడంతో ఉభయ పక్షాల మధ్య జరిగిన రభసతో లోగడ మూడు సార్లు కూడా ఈ ప్రక్రియ వాయిదా పడింది.
గొడవకు మీరంటే మీరు కారణమని రెండు పార్టీల వారూ ఆరోపించుకున్నారు. బీజేపీ సభ్యుల తీరుపై సుప్రీంకోర్టుకెక్కుతామని ఆప్ నేత అతిషి ప్రకటించారు. ఎన్నిక జాప్యానికి వారే కారణమని కూడా అన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ తీరును కూడా ఆప్ కౌన్సిలర్లు దుయ్యబట్టారు.