ఈమధ్య ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మంత్రి వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తెలంగాణలో మల్లారెడ్డిపై దాడి నేపథ్యంలో హాట్ హాట్ వార్ నడుస్తోంది. మొన్న అవినీతి మరకలతో పంజాబ్ మంత్రి విజయ్ సింఘాల్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర అరెస్ట్ అయ్యారు.
సత్యేంద్రను ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అదుపులోకి తీసుకుంది. హవాలా కేసుకు సంబంధించి ఈ చర్యలు తీసుకుంది. కోల్కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో మంత్రికి సత్సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ చేశారు అధికారులు. ఆయనతోపాటు భార్య, మరో నలుగురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
మంత్రి కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు గత నెలలోనే ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2018లోనే ఆయన్ను ప్రశ్నించారు అధికారులు. కానీ.. తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్ట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రతిపక్షాలను బెదిరింపులకు గురిచేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు.