జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ను ఆస్పత్రికి తరలించారు. అకస్మాత్తుగా సోమవారం ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయన్ని అధికారులు లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేర్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మొదట ఆయన్ని జీబీ పంత్ ఆస్పత్రికి అధికారులు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లోక్ నాయక్ ఆస్పత్రికి మార్చారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై సత్యేంద్ర జైన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ కూడా రంగ ప్రవేశం చేసి దర్యాప్తు నిర్వహించింది. అనంతరం మే 30న ఆయన్ని ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 4. 81 కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల ఈడీ విచారణ అనంతరం ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. కస్టడీలో ఉన్న ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది.