దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లలో ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అభ్యంతరకర పోస్టర్లు అంటిచడంపై సుమారు 100కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ‘మోడీ హఠావో.. దేశ్ బచావో’ (మోడీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి) అనే నినాదంతో ఉన్న పోస్టర్లను కొందరు అంటించారని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సుమారు 50వేలకు పైగా వివాదాస్పద పోస్టర్లను అంటించాలని కొందరు ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో సుమారు రెండు వేల పోస్టర్లతో ఉన్న ఒక వ్యాన్‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
అందులో మొత్తం 44 వేల పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఆ పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ కర్తల వివరాలు లేనట్టు పోలీసులు తెలిపారు. పోస్టర్లపై కేవలం ‘మోడీ హఠావో.. దేశ్ బచావో’ అన్న నినాదం మాత్రమే రాసి వుండటం గమనార్హం.
ఈ ఘటన వెనుక ఆప్ నేతల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆప్ కార్యాలయం నుంచి ఓ వ్యాన్ బయటకు వస్తుండగా ఆపి తనిఖీలు చేశామన్నారు. ఆ వ్యాన్‌లో నుంచి కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
మరోవైపు మోడీపై ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. మోడీ సర్కార్ నియంతృత్వ ధోరణి తారస్థాయికి చేరిందని ఫైర్ అయింది. మోడీపై ఏర్పాటు చేసిన పోస్టర్లలో 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేసేంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమున్నాయని ప్రశ్నించింది. ప్రధాని మోడీజీకి భారత్ ఓ ప్రజాస్వామ్య దేశమని తెలియదేమో అని, కేవలం ఒక్క పోస్టర్‌కే ఇంత భయమెందుకు? అంటూ ఆప్ ట్వీట్ చేసింది.