ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వృద్దులతో సహా అన్ని వర్గాల ప్రజలు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. రాజకీయ ప్రముఖులు కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో వైపు చలిని కూడా.. లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కు వచ్చిన పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది.
తమ పోలింగ్ బూత్ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు.. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం వల్ల మరికొందరు.. చివరకు ఓటు వేయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. సాయంత్రం ఐదున్నర వరకు 50 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సీఎం
క్రేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి హర్షవర్దన్, భాజపా ఎంపీ పర్వేష్ వర్మ, ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో.. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీ వెలుపల కూడా ఉండే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7 న వెలువడనున్నాయి.
అయితే ఈ ఎన్నికల నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.