రైతుల ఆందోళనతో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో భారతీయ పురాతత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఎర్రకోటను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి ఉండదని తెలిపింది. ఎర్రకోట మూసివేతకు గల కారణాలను మాత్రం స్పష్టం చేయలేదు. ఇటీవల ఢిల్లీలో బర్డ్‌ఫ్లూ, రిపబ్లిక్ డే కారణంగా రెండు వారాలుగా ఎర్రకోట మూసివేసే ఉంది.
27వ తేదీ పర్యాటకులకు కోటలోకి అనుమతి ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతుల ఆందోళన కారణంగా ఎర్రకోటలోని మెటల్ డిటెక్టర్లు, టికెట్ కౌంటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ నిన్న ఎర్రకోటను సందర్శించి.. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు.