ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్ధులపై మరో కేసు నమోదైంది. ప్రజా ఆస్తులు ధ్వంసం చేశారంటూ వారిపై కేసు పెట్టారు. భారీగా పెంచిన మెస్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నంచిన విద్యార్ధులపై పోలీసులు విచక్షణా రహితం లాఠీచార్జీ చేశారు. మహిళా పోలీసు అధికారులు ఉన్నప్పటికీ విద్యార్ధినిలపై మగ పోలీసులు చేయి వేయడంపై యూనివర్సిటీ విద్యార్ధి సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అయిషీ ఘోష్ మాట్లాడుతూ…పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ నియమించిన అత్యున్నత కమిటీ సమావేశానికి రిజిస్ట్రార్ హాజరు కాలేదని.. వీసీ, రిజిస్ట్రార్ లు హాజరు కాకుండా సమస్య ఎలా పరిష్కారమవుతుందన్నారు. పెంచిన ఫీజులను వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. సోమవారం వందలాది మంది విద్యార్ధులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లడంతో ఆ దారిలో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.