ఢిల్లీ సుల్తాన్ పురి కేసులో ఓ ట్విస్ట్. కారు ఈడ్చుకుపోయిన బాధితురాలిని అంజలీ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీపై వెనుక నిధి అనే ఆమె ఫ్రెండ్ కూడా ఉందని, యాక్సిడెంట్ కాగానే స్వల్ప గాయాలకు గురైన ఆమె భయంతో ప్రమాద స్ధలం నుంచి పారిపోయిందని వారు తెలిపారు. ఈ ఘటనలో అంజలీ సింగ్ పాదాలు కారు చక్రాల్లో ఇరుక్కుపోయాయని, సుమారు 12 కి.మీ. దూరం ఆ వాహనం అలాగే ప్రయాణించిందని పోలీసులు వెల్లడించారు.
హతురాలు వెళ్లిన రూట్ ని తాము ట్రేస్ చేయగా ఆమె ఒక్కరే కాక..ఆమె వెంట నిధి అనే ఈమె కూడా ఉన్నారని వారు చెప్పారు. వీరిద్దరూ ఓ హోటల్ వద్ద గొడవ పడ్డారని, హోటల్ స్టాఫ్ జోక్యం చేసుకుని వారించబోగా .. తమ విషయమేదో తాము చూసుకుంటామని, సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారని తెలిసింది. ఓయో హోటల్ నుంచి వీరు బయటకు వస్తున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఈ హోటల్లో రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నాక.. వీరు బయటకు వఛ్చినట్టు తెలిసింది. హతురాలి ఫ్రెండ్ నిధి అడ్రస్ ని పోలీసులు కనుగొన్నారు. త్వరలో ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరించనున్నారు.
ఈ కేసులో అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులు వాడిన కారు వారిది కాదని, అశుతోష్ అనే తమ స్నేహితుని వద్ద నుంచి దాన్ని అద్దెకు తీసుకున్నారని, ప్రమాదం జరిగిన తరువాత దాన్ని అదే స్థితిలో అతని ఇంటివద్ద వదిలేశారని తెలుస్తోంది.
దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ అనే వీరిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మద్యం తాగిన మత్తులో అసలేం జరిగిందో తమకు తెలియదని వీరు పోలీసులకు చెప్పారట. వీరిపై హత్యతో సమానమైన కేసును పోలీసులు నమోదు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా రాజీనామా చేయాలని కోరుతూ నిన్న ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.