ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరుణ్ పిళ్లైతో సహా ఇప్పటికే అరెస్టయిన 9 మందితో కలిసి కవితను 4 గంటలకు పైగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఇటు ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. అయితే.. పోలీసులు వారిని కట్టడం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని ఆఫీస్ దరిదాపుల్లో లేకుండా గట్టి బందోబస్తు చేశారు. ఈ క్రమంలో కీలక ఆంక్షలు పెట్టారు ఖాకీలు.
ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా పబ్లిక్ ఉంటే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసేందుకే భారీగా పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అయితే.. పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు.
ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మైకుల్లోనూ పోలీసులు అనౌన్స్ మెంట్ చేస్తున్నారు.