ఉత్తర భారత్‌లో చలి పంజా విసురుతోంది. ఇప్పటికే ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలు చలితో వణికి పోతున్నాయి. ఈ క్రమంలో కోల్డ్ స్పెల్ ఏర్పడుతుండటంతో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజుల పాటు కోల్డ్ స్పెల్ ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
కోల్డ్ స్పెల్ క్రమంలో పలు రాష్ట్రాల్లో మూడు డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సీజన్‌లో ఢిల్లీలో ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఈ క్రమంలో ఢిల్లీకి నేటి నుంచి మరో మూడు రోజుల పాటు ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలో నేటి నుంచి మరో ఆరు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది.
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఈ రోజు 1.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. లోధి రోడ్డులో ఉష్ణోగ్రత 1.6 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు అయింది. మరోవైపు పొగమంచుతో ఢిల్లీ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అటు విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
రాబోయే ఐదు రోజుల్లో ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాణా, చండీగఢ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ చెప్పింది. వాయువ్య ప్రాంతం మీదుగా చలిగాలులు వీస్తున్నాయని, అందువల్ల ఆయా ప్రాంతాల్లో జనవరి 18 వరకు రెండు నుంచి మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.