ఉత్తర భారత్ పై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు చలికి వణికి పోతున్నాయి. దీంతో పాటు పొగమంచు కూడా అధికమవుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది.
చలితో పాటు పొగమంచు కూడా పెరుగుతుండటంతో దేశ రాజధానితో పాటు పంజాబ్, హర్యానాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు రాజస్థాన్, బీహార్‌లకు ఆరంజ్ అలర్ట్ ను ఐఎండీ ప్రకటించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది.
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గత పదేండ్లలో ఇది అత్యంత రెండవ తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. వాయు నాణ్యత సూచీ కూడా ఘోరంగా పడిపోయింది. దీంతో జనవరి 15 వరకు పాఠశాలలను మూసి వేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 8 వరకు శీతాకాల సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి వుంది. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు పాఠశాలలను ఈ నెల 15వరకు మూసి వుంచాలని విద్యాశాఖ సర్క్యులర్ లో పేర్కొంది.