ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం ఇటీవల గోవాలో కొన్ని రోజులు హాయిగా గడపాలనుకుని వెళ్తే అక్కడ వారికి దారుణ అనుభవం ఎదురైంది. కత్తులు, బెల్టులతో వారిపై దాడి జరిగింది. గ్రేటర్ నోయిడాలో నివసించే ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కుటుంబం ఈ నెల 5 న గోవా వెళ్ళింది. అక్కడి అంజునా ప్రాంతంలోని రిసార్ట్ లో విడిది చేసింది. ఆ రోజు సాయంత్రం స్విమ్మింగ్ పూల్ వద్ద తాము ఉండగా ఆ హోటల్ స్టాఫ్ మెంబర్లలో ఒకరు అక్కడికి వచ్చి అసభ్యవ్యాఖ్యలు చేశాడని, దీనిపై తాము హోటల్ మేనేజర్ కి ఫిర్యాదు చేయగా ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకుని అతడ్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారని బాధితులు అనిల్ శర్మ, అశ్విని కుమార్, జతిన్ శర్మ తెలిపారు.
రోషన్ అనే ఆ ఉద్యోగి ఇది మనసులో పెట్టుకుని మరో ముగ్గురు, నలుగురితో కలిసి కత్తులు, బేస్ బాల్ బ్యాట్లు, బెల్టులతో తమపై దాడి చేశారని జతిన్ శర్మ చెప్పారు. వారిని అడ్డుకోబోయిన తన తండ్రిపై కూడా ఎటాక్ చేశారని, ఆయనతో బాటు తమకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నాడు.
సుమారు 15 నుంచి 20 నిముషాలపాటు వారిలా విచక్షణా రహితంగా తమపై దాడికి పాల్పడి పారిపోయారని శర్మ చెప్పారు. హోటల్ సిబ్బంది తమను ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొంది ఈ నెల 9 న తిరిగి ఢిల్లీకి చేరుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై గోవా పోలీసులు రోషన్ తో సహా మరో నలుగురిని అరెస్టు చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ దీనిపై స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు ట్వీట్ చేశారు. నిందితులమీద పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మళ్ళీ గోవా పేరెత్త బోమని జతిన్ శర్మ ఆవేదనగా ట్వీట్ చేశారు.