ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసన దీక్షతో మూతపడిన ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ కీలక రోడ్డు రెండు నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తులు నిరసనకారులతో మాట్లాడి రోడ్డు క్లియర్ అయ్యేలా చేశారు. నిరసన తెలిపే మన హక్కులను కాపాడుకుంటూనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిందిగా తాము నిరసనకారులను కోరినట్టు మధ్యవర్తి, సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే తెలిపారు. నిరసనకారులపై బలప్రయోగం చేయకుండా వారికి నచ్చజెప్పి శాంతి యుతంగా రోడ్డుపై నుంచి దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు లాయర్లు సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్ లను సుప్రీంకోర్టు నియమించింది. దీంతో వారు నిరసనకారులతో మాట్లాడి రోడ్డు పై నిరసన చేయకుండా ఒప్పించారు.
సీఏఏ ను వ్యతిరేకిస్తూ 69 రోజులుగా షహీన్ బాగ్ లో రోడ్డుపైనే మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సీఏఏ, ఎన్.ఆర్.సి లను ఉపసంహరించుకునేంత వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా హోం మంత్రి అమిత్ షా సీఏఏ, ఎన్.ఆర్.సి నలు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తామని భీష్మించకు కూర్చున్నారు. దీంతో 69 రోజులుగా ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ ప్రధాన రహదారి మూసుకుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొంటున్నారు. షహీన్ బాగ్ నిరసనకారులను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారించిన కోర్టు సమస్య పరిష్కారానికి మధ్యవర్తులను నియమించింది.