వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల దగ్గర తీవ్రత అధికంగా ఉంది. గురుగ్రామ్, ఢిల్లీ సరిహద్దులో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు, పారామిలటరీ జవాన్లు చెక్ చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
భారత్ బంద్ కారణంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. గత అనుభవాల దృష్ట్యా శాంతి భద్రతలను కాపాడటానికి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హర్యానా, పంజాబ్, యూపీలో రైతులు రోడ్డెక్కారు. నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రైళ్ల పట్టాలపై కూర్చొని ధర్నా చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ డిమాండ్ చేశారు.
పంజాబ్ వెళ్లే ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై రైతులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలన్నీ క్లోజ్ అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు బంద్ ను కొనసాగిస్తున్నాయి.