ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో హతురాలు అంజలీ సింగ్ ఫ్రెండ్ నిధిపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధి తీరుపై దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు అంత ఘోర ప్రమాదంలో చిక్కుకుంటే నిధి అక్కడినుంచి పారిపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఈ ఘోర సంఘటన జరిగిన 48 గంటల తరువాత పోలీసులు నిధి ఆచూకీని ట్రాక్ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తనను అంజలి ఫ్రెండ్ గా చెప్పుకున్న ఆ అమ్మాయి .. పదేపదే తప్పంతా అంజలిదేనని అంటోందని, ఇలాంటి ఫ్రెండ్ కూడా ఉంటారా అని స్వాతి మలివాల్ అన్నారు.
తన స్నేహితురాలు యాక్సిడెంట్ కి గురై కారు కిందపడి బాధతో కేకలు పెడుతుంటే.. ఈమె అక్కడి నుంచి ఇంటికి పారిపోయి.. నిద్రపోయిందని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తక్షణమే ఎవరికైనా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
నిధి అలా చేసి ఉంటే అంజలిని రక్షించుకోగలిగి ఉండేవారమని స్వాతి మలివాల్ అభిప్రాయపడ్డారు. నిధిని నమ్మజాలమని, తన ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే ..అంజలిని అప్రదిష్ట పాల్జేసేలా ఆమె మాట్లాడడమేమిటన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని స్వాతి మలివాల్ మళ్ళీ డిమాండ్ చేశారు.