ఢిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని కనిజవాలా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ళ యువతి అనూహ్యంగా దుర్మరణం చెందింది. ఆమె స్కూటీ నడుపుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని సుమారు 12 కిలోమీటర్ల దూరం ఆమెను అలాగే ఈడ్చుకు వెళ్ళింది. చివరకు ఆమె మృతదేహాన్ని నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నగర శివారు ప్రాంతంలో కనుగొన్నారు. తన కుమార్తె మృతి వార్త విని ఆమె తల్లి దుఃఖానికి అంతు లేకపోయింది.
తన కూతురికి యాక్సిడెంట్ జరిగిందని తనకు మొదట సమాచారం అందిందని, ఆ తరువాత పోలీసులు గానీ, తమ బంధువులుగానీ ఎలాంటి సమాచారమూ తెలియజేయలేకపోయారని ఆమె వెల్లడించింది. చివరకు ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని వాపోయింది. యాక్సిడెంట్ ఘటనలో ఆ యువతి స్కూటీని కారు ఢీకొని అలాగే ప్రయాణించడంతో ఆమె బట్టలు కారు టైర్లల్లో చిక్కుకుపోయాయని తెలిసింది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురికి ఈ విషయమే తెలియలేదట. అలా పన్నెండు కి.మీ. దూరం కారు అలాగే ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లగా.. తీవ్ర గాయాలకు గురైన ఆమె మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు జరిపి ఈ ఘటనకు కారకులైన నలుగురిని అరెస్టు చేశారు. తాము మద్యం తాగి ఉన్నామని, బహుశా ఆ కారణం వల్లే ఏం జరిగిందో తెలియలేదని వారు ఇంటరాగేషన్ లో తెలిపారు.
అయితే శివారు ప్రాంతంలో బాధిత యువతి నగ్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ..పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వారు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 10 గంటల కల్లా ఇంటికి తిరిగి వచ్ఛేస్తానని చెప్పి వెళ్లిన తన కూతురు ఇలా శవమైందని ఆ తల్లి విలపిస్తోంది.