ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్‌యూ) కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది. ఇక నుంచి వర్సిటీలో ధర్నాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జేఎన్ యూ చెప్పింది. ధర్నాలు చేసే వారిపై కొత్త నిబంధనల ప్రకారం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.
క్యాంపస్‌లో హింసకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఇక నుంచి వర్సిటీలో హింసకు పాల్పడే వారి అడ్మిషన్లను రద్దు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ నూతన నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని అధికారలు తెలిపారు.
గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఇటీవల బీబీసీ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో వర్సిటీలో ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు నూతన నిబంధనలు తీసుకు వచ్చారు.
కొత్త నిబంధనలు అందరికీ వర్తిస్తాయని నోటీసుల్లో జేఎన్‌యూ పేర్కొంది. వర్సిటీ ప్రాంగణంలో పేకాట ఆడటం, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించడం, దుర్వినియోగం చేయడం, అవమానకరమైన పదజాలం, ఫోర్జరీ వంటి 17 నేరాలకు ఎలాంటి శిక్షలు విధించనున్నారో నోటీసుల్లో తెలిపింది.