ఉక్రెయిన్ పై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నారు. సైనికులతో పాటు అమాయక పౌరులు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే చాలా నగరాలు శిథిలం కాగా.. ఎటు చూసిన శవాల దిబ్బలే దర్శనమిస్తోన్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లో తలదాచుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఓ వ్యక్తి పిజ్జాలు డెలివరీ చేస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నాడు.
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో పావ్లో అనే వ్యక్తి పిజ్జా షాపును నడుపుతున్నాడు. అయితే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని అల్లాడుతున్న డాక్టర్లకు, అవసరమైన వ్యక్తులకు స్వయంగా వెళ్లి పిజ్జాలు డెలివరీ చేస్తున్నాడు. కారులో నగరం చుట్టూ తిరుగుతూ అవసరమైన వారికి పిజ్జాలను అందజేస్తున్నాడు. ఇలా అవసరమైన వారికి ఇచ్చే పిజ్జాలకు ఇతర దేశాల్లో ఉండే ప్రజలు డబ్బులు అందిస్తున్నారు. వాటితో పావ్లో పిజ్జాలు తయారుచేసి ఉక్రెయిన్‌లోని ప్రజల ఆకలి తీరుస్తున్నాడు.
ఈ విషయాన్ని హన్నా లియుబకోవా అనే జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘ఖార్కివ్‌లోని పిజ్జా షాపు యజమాని పావ్లో నగరమంతా పిజ్జా డెలివరీ చేస్తాడు. వైద్యులు, అత్యవసర కార్మికులు, సాధారణ వ్యక్తుల కోసం పిజ్జాలు ఇస్తాడు. ఆ ఆర్డర్‌ల కోసం వివిధ దేశాల ప్రజలు కాల్ చేసి డబ్బులు చెల్లిస్తారు’ అని ట్విట్టర్‌లో ప్లావో వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. యుద్ధ భూమిలో పావ్లో చేస్తున్న పనిని నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు తాము కూడా సాయం చేస్తామని అతని వివరాలు చెప్పాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
#Ukraine The owner of a pizzeria in Kharkiv, Pavlo, delivers pizza around the city on his own. According to him, people call from abroad and pay for orders for doctors, emergency workers and ordinary people
— Hanna Liubakova (@HannaLiubakova) April 12, 2022
Advertisements