రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య విధానం కంటే ఎవరూ ఎక్కువ కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని ఎవరూ చూడకూడదన్న ఆయన.. నేరాల నిరోధానికి పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అని తెలిపారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ 19వ స్మారకోపన్యాసం చేశారు.
ప్రజాస్వామ్యంలో దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలపై సీజేఐ ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే, ప్రారంభ దశలో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేదని, నిస్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేదని ఆయన అన్నారు.
పోలీసు వ్యవస్థను ప్రస్తావిస్తూ, అందులో కొన్ని సంస్కరణల గురించి మాట్లాడారు. పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అవినీతి తదితర ఆరోపణలతో పోలీసుల ప్రతిష్ఠ మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సీజేఐ.
” పోలీసులు, దర్యాప్తు సంస్ధలు సహా అన్ని వ్యవస్ధలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండడం సహా వాటిని బలోపేతం చేయడం అవసరం. ఎలాంటి అధికారిక వ్యవస్ధల జోక్యానికి అవి అవకాశం ఇవ్వరాదు. పోలీసులు నిస్పక్షపాతంగా పని చేసి, నేర నిర్మూలనపై దృష్టి సారించాలి. సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరిసేలా పోలీసులు.. ప్రజలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. కాలానుగుణంగా రాజకీయ, కార్యనిర్వహక వ్యవస్థలు మారుతూ ఉంటాయి. కాని ఓ వ్యవస్ధగా మీరు శాశ్వతంగా ఉంటారు. పోలీసులు ధృడంగా, స్వతంత్రంగా ఉండాలి. మీ సేవలకు మద్దతు తెలపండి.” అని ఎన్వీ రమణ అన్నారు.
అలాగే, అధికార మార్పుతో తాము వేధింపులకు గురవుతున్నామని తరచూ పోలీసు అధికారులు సంప్రదిస్తున్నారని.. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం పోలీసులకు ఇప్పుడు ఎంతో అవసరమని సూచించారు. కొంత మంది అధికారులైనా వ్యవస్థలో మార్పులు తీసుకురావచ్చన్నారు. ఇన్‌ఫ్రా, మ్యాన్ పవర్ లేకపోవడం, తక్కువ స్థాయి అమానవీయ పరిస్థితులు, ఆధునిక పరికరాల కొరత, సాక్ష్యాలను పొందే సందేహాస్పద పద్ధతులు, రూల్ బుక్ ప్రకారం పనిచేయడంలో విఫలమైన అధికారులు శిక్షార్హులని ఎన్వీ రమణ అన్నారు.