ఇటీవల యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీలో రగిలిన బుల్డోజర్ రాజకీయాలు తాజాగా రాజస్థాన్ కు పాకాయి. ఆల్వార్ జిల్లాలోని రాజ్‌గఢ్‌లో అభివృద్ధి పనుల పేరుతో దాదాపు 300 ఏళ్లనాటి పురాతన శివాలయాన్ని బుల్డోజర్ తో కూల్చివేశారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో కూల్చివేతలకు ప్రతీకారంగానే రాజస్థాన్ లోని అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శివాలయాన్ని కూల్చివేసిందని బీజేపీ ఆరోపించింది.
రాజ్‌గఢ్‌లోని సరాయ్ గోల్ చక్కర్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. బుల్డోజర్‌తో తొలుత ఆలయ పైకప్పును, పిల్లర్లను కూల్చివేశారు. అనంతరం డ్రిల్స్‌ను ఉపయోగించి ఆలయం లోపల శివ లింగాన్ని పెకిలించారు. ఈ మేరకు కూల్చివేత ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే జౌహరీ లాల్ మీనా పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా.. ఆలయ కూల్చివేత ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డు విస్తరణ పేరుతో హిందువులకు చెందిన 85 ఇళ్లు, షాపులను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసిందని ఆరోపించింది. ఆలయం కూల్చివేత ద్వారా హిందువుల మనోభావాలను గెహ్లోత్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు. కాగా ఆలయ కూల్చివేతకు సంబంధించి బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ అవనసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ మండిపడ్డారు.
‘‘ఏ ఆలయం కూల్చివేతకు సంబంధించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారో.. అక్కడ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది’’ అని గోవింద్ సింగ్ వ్యాఖ్యానించారు. కాగా రోడ్డు విస్తరణ కోసం రాజ్‌గఢ్‌లో ఏప్రిల్ 17 నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 150 ఇళ్లు, షాపులను నేలమట్టం చేశారు.