జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జమ్ములోని మాలిక్ బజార్‌లో ఓ షోరూమ్ ను కూల్చి వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి షోరూం యజమానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ములోని మైసమ్మ, సుంజ్వాన్, బతిండి, నర్వాల్ బైపాస్ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. మరోవైపు అధికారులకు ఉగ్రసంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
కూల్చి వేతలపై పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌గా బీజేపీ మార్చిందని ఆమె ఆరోపించారు. పేదలను ఇబ్బంది పెట్టే చర్యలను ఎంత మాత్రమూ ఉపేక్షించబోమని అన్ని పార్టీలు వెల్లడించాయి.
దక్షిణ కశ్మీర్‌లో కిసాన్ తెహ్రీక్ అసోసియేషన్ నేతృత్వంలో స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇది తమ భూమి అని, అధికారుల ఆదేశాలను పాటించబోమని స్థానికులు నినాదాలు చేశారు. లాల్‌చౌక్‌లో దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు.