అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు హెచ్ఎండీఏ పర్యవేక్షణలో గత నెల 17 నుంచి దాడులు జరుపుతున్నాయి. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు సాగిస్తున్నాయి.
శనివారం చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలోని ఆరు అక్రమ నిర్మాణాలను గుర్తించారు అధికారులు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలు, అనధికారిక రోడ్లను గుర్తించారు. వాటిపై తగిన చర్యలు తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మరో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. హెచ్ఎండీఏ పరిధిలో నిర్దిష్టమైన అనుమతులు లేకుండా భవనాలు, గోదాములు, ఇతర అక్రమ నిర్మాణాలను విచ్చలవిడిగా చేపట్టారు. ఇప్పుడు వాటన్నింటినీ గుర్తిస్తున్న అధికారులు కూల్చివేస్తున్నారు.
శనివారం వరకు 202 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు కొనసాగుతాయని తెలిపారు అధికారులు.