ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పాటు వర్షం కూడా పడుతోంది. ఈ క్రమంలో జోషిమఠ్ లోని కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఓ వైపు మంచు, మరో వైపు వర్షం నేపథ్యంలో కూల్చివేత పనులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్టు చమోలి జిల్లా మెజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా వెల్లడించారు.
ఈ క్రమంలో కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత కూల్చి వేత పనులను పున:ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జోషిమఠ్ కేంద్రం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో భారీగా హిమం పేరుకుపోతుండటం, మరోవైపు వర్షం కూడా కురుస్తోంది.
దీంతో అటు స్థానికులు, ఇటు అధికారులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక వారం రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని ఐఎండీ ఇప్పటికే పేర్కొంది. ఈ నెల 23 నుంచి 27 వరకు భారీగా మంచుకురవడంతో పాటు, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
జోషిమఠ్‌లో భూమి కుంగిపోతోంది. యేటా 10 సెంటీమీటర్లు మేర భూమి కుంగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. జోషిమఠ్‌లో ఇండ్లకు భారీగా బీటలు వస్తున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో స్థానికులను వేరే ప్రాంతాలకు అధికారులు తరలించారు.