గచ్చిబౌలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు డీఎల్ఎఫ్ వద్ద ఉన్న ఇన్ఫినిటీ డ్రైవ్ఇన్ లో కూల్చివేతలు చేపట్టారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈ డ్రైవ్ ఇన్ ను 5 జేసీబీలు, వందల మంది పోలీసులు మోహరించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమంటూ ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు.
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. షాపులు, హోటల్స్ నిర్వహించుకునేవారికి కనీసం వాటిని ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకపోవడంతో కొద్ది సేపు గొడవకు దిగారు. దాంతో సామాగ్రిని తొలగించి కూల్చివేతలు కొనసాగించారు.
సంధ్యా కన్వేన్షన్ శ్రీధర్ రావు తమకు 9 సంవత్సరాల లీజుకు ఇచ్చారని ఆయనే పర్మిషన్ల కోసం జీహెచ్‌ఎంసీతో పాటు మిగతా శాఖలను సంప్రదించి అన్ని అనుమతులు తీసుకున్నామని, పనులు చేపట్టుకోవచ్చని కూడా హామీ ఇచ్చాకనే డ్రైవ్ ఇన్ నడుపుతున్నామన్నారు.
కానీ ఆయనే కోర్టుకు వెళ్లి తిరిగి ఇబ్బందులకు గురి చేస్తూ డ్రైవ్ ఇన్ ను కూల్చి వేయిస్తున్నారని వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .