ఇటీవల బీఆర్ఎస్ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తోట పవన్ ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో అరాచక పాలన, అప్రజాస్వామిక వ్యవస్థ సాగుతోందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ, దాడులకు దిగబడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని భట్టి మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకుల రాక్షసత్వం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఉన్నాయా అన్న అనుమానం తలెత్తుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులపై జరుగుతున్న దాడులను రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సేన రెడ్డి ఖండించారు.
పవన్ పై జరిగిన దాడి బాధాకరమని, తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో కాంగ్రెస్ శ్రేణులపై బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులను పక్కకు తప్పించి వేరే వ్యక్తులను కేసులో భాగస్వామ్యులను చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు.