పెద్ద నోట్ల రద్దుపై నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని.. ఈ తీర్పుతో విభేదించిన జస్టిస్ బి.వి. నాగరత్న ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని నలుగురు జడ్జీలు సమర్థించగా.. అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం లోని ఈ జడ్జి మాత్రం పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు. 500, వెయ్యి నోట్లను రద్దు చేయడం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం పాటించిన విధానం సబబుగా లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఇది ఆర్బీఐ చట్టం లోని 26 (2) సెక్షన్ కి అనుగుణంగా లేదని ఆమె అన్నారు. ఇది శాసన పరంగా ( లెజిస్లేషన్) ఉండాలి తప్ప ప్రభుత్వ (ఎగ్జిక్యూటివ్) పరంగా కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్ల వాదనతో ఆమె ఏకీభవిస్తూ ఆర్బీఐ చట్టం లోని ఈ సెక్షన్ ప్రకారం.. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు దీనిపై స్వతంత్రంగా సిఫారసు చేయాల్సి ఉందన్నారు.
కేవలం కేంద్రం సలహాపై రిజర్వ్ బ్యాంక్ .. పెద్ద నోట్లను రద్దు చేయకుండా ఉండాల్సింది అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్రం ఈ చర్య తీసుకోవలసి ఉండిందన్నారు. ఈ నిర్ణయంపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సి ఉందని, కానీ కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దీన్ని అమలులోకి తెచ్చారని ఆమె సున్నితంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
‘డీమానిటైజేషన్ లక్ష్యం లోని ఉదాత్త ఉద్దేశాలను నేను ప్రశ్నించడం లేదు.. ఇందులోని న్యాయపరమైన కోణాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా.. ‘ అని చెప్పిన ఆమె.. నల్లధనం, ఉగ్రవాద శక్తులకు నిధుల అందజేత, నకిలీ నోట్ల చలామణి వంటివాటిని నివారించడానికి
ఇది దోహదపడుతుందని అన్నారు.